అట్లతద్దె నోము
ప్రాచీనకాలం నాటిమాట. ఒకరాజుగారి అమ్మాయి తన చెలికత్తెలతో అట్లతద్దె నోము నోచినది. చెలికత్తెలందరూ ఉపవాసముండిరి. రాచకన్య మాత్రం సుకుమారి కావడంవల్ల ఉపవాసముండి సాయంకాలానికి సొమ్మసిల్లి పడిపోయినది.అంట ఆమె సోదరుడు ఆరిక కుప్పకు నిప్పుపెట్టి చెట్టునకొక అద్దము వ్రేలాడదీసి మాన్తా చూపించి చంద్రోదయమైనది భోజనం చేయవచ్చును అని చెప్పాడు. పాపం నిజమనుకుని ఆ రాచబిడ్డ వాయనమందించి భోజనం చేసినది.
కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా ఆమె అన్నలు పెండ్లి సంబంధములను చూచుచుండిరి. వ్రతమును లోటు కలగడంవల్ల ఆమెకు మంచి సంబంధం కుదరడంలేదు. తనతోటివారందరికీ వివాహాలు అయ్యాయి. ఎన్ని సంబంధములు వెదకినను ముసలి వరుడే దొరకుటచే, కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి.ఆ సంగతి తెలసి ఆ రాచబిడ్డ "అయ్యో! అట్లతద్ది నోము నోచిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కాని నాకీ ముసలి మగడేల దాపరించుచున్నాడు!" అని విచారించి, వృద్ధ భర్తను వివాహమాడుట కంగీకరింప లేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహమును జేయనెంచిరి. కాని ఆమె యందులకు సమ్మతింపక, ఒక నాటి రాత్రి అడివికి పోయి ఒక మర్రిచెట్టు క్రింద తపస్సు చేయుచుండెను.
కొంత కాలమునకు పార్వతి పరమేశ్వరులామెను చూచి "ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చేయు చున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంత నామె వారిని అతి భక్తితో నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను.
వారది విని "అమ్మా! నీవు అట్లతద్దె నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనము జేసి యుల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున నీవు యింటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు వుపవాసముండిన పిమ్మట భోజనము జేయు" మని చెప్పి అదృశ్యమయిరి. అంత నామె తన యింటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లి దండ్రులకు చెప్పి యధావిధిని నోము నోచుకొనెను. తరువాత నామెకు చక్కని పడుచు మగనితో పెండ్లి జరిగెను. వ్రాత ఫలితంగా ఆమె తన భర్తతో హాయిగా సుఖంగా జీవించింది.
ఉద్యాపన
ఈవ్రతము ఆశ్వయుజ మాస మండలి బహుళ తదియనాడు ఉపవసించవలెను. ఈ అట్లతద్దెకి గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి. కొంతమంది గోరింటాకు ముద్దను ముందురోజు ముత్తయిదువులకు ఇస్తారు. చంద్రోదయమయ్యే వరకూ ఏమీ తినకుండా ఉపవాసముండి చీకటి పడినంతటనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టవలెను. అలా 9 సంవత్సరములు జరుపవలెను. 10 వ సంవత్సరాన 10 మంది ముత్తయిదువులకు తలంటి స్నానం చేయించవలెను.10 మందికి 10 అట్లు, పసుపు, కుంకుమ రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలము సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టవలెను.
Posted by YAMUNA
0 Comments